: గురు, శుక్ర గ్రహాలపైకి దూసుకుపోతాం.. ఇస్రో సహాయ సంచాలకుడు నాగేశ్వర్రావు వెల్లడి
మంగళ్యాన్తో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన ఇస్రో మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఈసారి గురు, శుక్ర గ్రహాలపైన దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో సహాయ సంచాలకుడు ఎం.నాగేశ్వరరావు తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్‌లో స్వయంగా వెల్లడించారు. ఇతర గ్రహాలపై పరిశోధనలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. గురుడు, శుక్ర గ్రహాలపై పరిశోధనలు చేపట్టేందుకు కావాల్సిన వాహక నౌకలు, ఉపగ్రహాల డిజైన్ కోసం విశ్లేషిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని, పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మరికొన్ని సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. భూమి నుంచి శుక్రుడికి ఉన్న దూరం, ఇతర పరిస్థితులను బట్టి దానిపైకి శాటిలైట్‌ను పంపే అవకాశం 19 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. భూమండలం నుంచి గురుడు 610 మిలియన్ మైళ్లు, శుక్రుడు 162 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నట్టు వివరించారు. వచ్చే ఏడాది చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనున్నట్టు నాగేశ్వరావు తెలిపారు.