: నోట్ల రద్దు ప్రభావం నిల్.. యూపీలో బీజేపీకే పట్టం.. తేల్చి చెప్పిన ఇండియాటుడే సర్వే!
యూపీలో త్వరలో జరగనున్నశాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడం ఖాయమని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న విశ్లేషకుల అంచనాలను పటాపంచలు చేస్తూ ప్రజలు బీజేపీకి జైకొట్టారు. నోట్ల రద్దుకు ముందు నిర్వహించిన సర్వేలో బీజేపీకి 31 శాతం మంది అనుకూలమని చెప్పగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వారి సంఖ్య 33 శాతానికి పెరగడం గమనార్హం.
మొత్తం 403 సీట్లు ఉన్న యూపీలో బీజేపీకి 206-216 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిన అధికార సమాజ్‌వాదీపార్టీ 26 శాతం ఓట్లతో 92-97 స్థానాలకు పరిమితం కాగా, ఎలాగైనా మరోమారు సీఎం కుర్చీ ఎక్కాలని భావిస్తున్న మాయావతి పార్టీ బీఎస్పీకి 79-85 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో రెండున్నర దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి కూడా నిరాశ తప్పేలా కనిపించడం లేదు. కేవలం 5-9 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
ఇండియాటుడే సర్వే ఇలా ఉండగా, ఏబీపీ-లోక్‌నీతి సీఎస్‌డీఎస్ ఒపీనియన్ పోల్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీనే మరోమారు అధికారం చేపట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఆ పార్టీకి 141-151 సీట్లు వస్తాయని పేర్కొనగా, బీజేపీకి 124-134 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమికి అధికారం దక్కకున్నా అతి పెద్ద పార్టీగా నిలిచే అవకాశం ఉందని ఏబీపీ సర్వే పేర్కొంది.