: ఎంసెట్ స్కాంలో కీలక నిందితుడి మృతి.. గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి
ఎంసెట్ స్కాంలో కీలక నిందితుడు కమిలేశ్వర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన కమిలేశ్వర్ బీహార్ రాజధాని పట్నాకు చెందినవాడు. అస్వస్థతతో రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే నిందితుడి మృతదేహానికి ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది.
ఎంసెట్ స్కాంలో ఇద్దరు ప్రధాన నిందితులను సీఐడీ నాలుగు రోజుల క్రితమే పట్నాలో అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడి సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో నిందితుడు కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చామని అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు పేర్కొన్నారు.
పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతడి పరిస్థితి విషమిస్తున్నా సరైన వైద్యం అందించకపోవడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న అధికారుల మెడకు కమిలేశ్వర్ మృతి వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మృతి చెందిన కమిలేశ్వర్ పట్నాలో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం.