: గాంధీ చిత్రం లేని పెద్ద నోట్లు.. కంగారుపడిన రైతులు!


మహాత్మా గాంధీ బొమ్మ లేని పెద్దనోట్లను బ్యాంకు నుంచి తీసుకున్న రైతులు ఆశ్చర్యపోయిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. వాటిని చూసి దొంగనోట్లు ఏమో అనుకుని ఏ బ్యాంకు నుంచి అయితే విత్ డ్రా చేసుకున్నారో అక్కడికే పరుగులు పెట్టారు. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ మీన అనే రైతు అక్కడి ఎస్బీఐ బ్రాంచ్ లో రూ.6000 విత్ డ్రా చేశాడు. వాటిలో రెండు వేల రూపాయల కొత్త నోట్లు ఉన్నాయి. ఈ కొత్త నోట్లను ఇంతవరకూ చూడని లక్ష్మణ్, ఆ నోట్లను తన కుమారుడికి ఇచ్చాడు.

ఆ నోట్లను పరిశీలించి చూస్తున్న అతనికి, గాంధీ చిత్రం లేకపోవడాన్ని గమనించాడు. అవి దొంగ నోట్లు అయి ఉండవచ్చనే అనుమానాన్ని తండ్రి వద్ద వ్యక్తం చేశాడు. దీంతో, లక్ష్మణ్  బ్యాంక్ కు పరుగు తీశాడు. ఈ విషయాన్ని బ్యాంక్ సిబ్బందికి చెప్పడంతో ఆ నోట్లను వారు పరిశీలిస్తున్న సమయంలోనే, గుర్మీత్ సింగ్ అనే మరో రైతు అక్కడికి వచ్చాడు. తాను డ్రా చేసుకున్న రెండు వేల నోట్లపై కూడా గాంధీ చిత్రం లేదని చెప్పాడు. దీంతో, ఇద్దరు రైతుల నుంచి ఆయా మొత్తాలను బ్యాంకు సిబ్బంది వెనక్కి తీసుకున్నారు. అచ్చు సరిగా పడకపోవడం వలనే, గాంధీ చిత్రం రాలేదని, ఆ ప్రదేశంలో ఖాళీగా ఉందని బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు.
  

  • Loading...

More Telugu News