: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత... ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం
ఈ రోజు శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్‌పై ప్రసంగించిన తరువాత సభ రేపటికి వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ వాయిదా పడిన తరువాత శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్ మెంటుపై సభలో తాము మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు సభ లోపలే బైఠాయించి, నిరసన కొనసాగిస్తున్నారు.
ఫీజులపై తాము అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ప్రభుత్వం జవాబు ఇవ్వడం లేదని వారు విమర్శించారు. సర్కారు దిగివచ్చే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని తేల్చి చెప్పారు. అసెంబ్లీలోనే కూర్చొని నిరసన తెలుపుతున్న వారి ఆందోళనను విరమింపజేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో వారిని అరెస్ట్ చేసి తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.