dyavuda: ‘ద్యావుడా’ సినిమాపై అభ్యంతరం.. విడుదల చేస్తే భౌతిక దాడులకు దిగుతామని భజరంగ్‌ధళ్ హెచ్చరిక!
దర్శకుడు సాయిరాం దాసరి తెలుగులో తెరకెక్కిస్తున్న‘ద్యావుడా’ సినిమాపై భజరంగ్‌ధళ్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని వారు ఆందోళన తెలిపారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారని, విడుదలను ఆపకపోతే భౌతిక దాడులకు దిగుతామని భజరంగ్‌ధళ్ కార్యకర్తలు హెచ్చరించారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా యూట్యూబ్‌లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్లో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని నెరేడ్మెట్ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.
ఈ సినిమా బృందం విడుదల చేసిన సదరు టీజర్లో వేంకటేశ్వరస్వామి ఫొటోను నేలకేసి కొట్టడంతో పాటు పవిత్ర శివలింగంపై బీరుతో అభిషేకం చేయడం, సిగరెట్లు కాల్చి ధూపం పెట్టడం లాంటి పలు సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇటువంటి సన్నివేశాలు తీయడమే కాకుండా వాటినే యూట్యూబ్‌లో పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారని, వెంటనే ఆ టీజర్‌ను యూట్యూబ్ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. ఈ సినిమా నిర్మాత హరితో పాటు దర్శకుడిని అరెస్టు చేయాలని వారు పోలీసులను కోరారు.