: శాసనసభలో పేపర్లు చింపేసిన కోమటిరెడ్డి!
తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2016-17లో ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఒక పైసా కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతుండగా... కూర్చోవాలంటూ డిప్యూటీ స్పీకర్ అన్నారు. దీంతో, 'డిప్యూటీ స్పీకర్ బెల్ కొడితే కూర్చోవాలా?' అంటూ కోమటిరెడ్డి చేతిలో వున్న పేపర్లను విసురుగా చింపేశారు.
దీంతో సభలో గందరగోళం చెలరేగింది. డిప్యూటీ స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలంటూ కోమటి రెడ్డిని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. దీంతో జానారెడ్డి కల్పించుకుని... బెల్ కొట్టడంపై అభ్యంతరం లేదని, కానీ వెంటనే కూర్చోమనడంపై కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారని అన్నారు. కోమటిరెడ్డికి మైక్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ను కోరారు. ఆ తర్వాత కోమటిరెడ్డి మాట్లాడుతూ, డిప్యూటీ స్పీకర్ ను తాను అగౌరవపరచలేదని... ఒకవేళ అలా భావిస్తే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.