: మూడు సెంచరీలు...తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ భారీ స్కోరు
సిడ్నీ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన చివరి టెస్టులో ఆసీస్ అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 538/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెన్ షా (184), వార్నర్ (113), హ్యాండ్స్ కోంబ్ (110) లు సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పాక్ జట్టుకు నాలుగో ఓవర్ లో హాజెల్ వుడ్ షాకిచ్చాడు. ఓపెనర్ షెర్జిల్ ఖాన్ (4) ను పెవిలియన్ కు పంపాడు. తరువాతి బంతికి బాబర్ అజమ్ (0) ను బలిగొన్నాడు.
దీంతో కేవలం ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాక్ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులో వున్న మరో ఓపెనర్ అజహర్ అలీ (58), యూనిస్ ఖాన్ (64) లు ఆదుకున్నారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలతో ఆకట్టుకోవడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి పాకిస్థాన్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట జరగాల్సి ఉండగా ఆసీస్ బౌలర్లు జోరుమీదున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టులు గెలుచుకున్న ఆసీస్ జట్టు ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకుంది.