: ఆర్మీ చీఫ్ ఎంపికలో సీనియారిటీపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారత ఆర్మీ చీఫ్ ఎంపికపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ చీఫ్ ను ఎంపిక చేసే ప్రక్రియలో సీనియారిటీని, నిబంధనలను పక్కన పెట్టారన్న ప్రశ్నకు బదులుగా... ప్రతి దానికి సీనియారిటీనే ప్రాతిపదిక కాదని సమాధానమిచ్చారు. సీనియారిటీ మాత్రమే ప్రాతిపదిక అయితే కేబినెట్ కమిటీలు, ప్రత్యేక నియామక విధానాలు ఎందుకని ప్రశ్నించారు.
అంతేకాదు, సీనియారిటీ మాత్రమే ప్రాతిపదిక అయితే, కంప్యూటర్ ను కూడా ఆర్మీ చీఫ్ గా చేయవచ్చని వ్యంగ్యంగా చెప్పారు. ఎవరినైతే ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేశామో... వారు అన్ని విధాలా తగినవారనే హామీ ఇవ్వగలనని చెప్పారు. జనరల్ బిపిన్ రావత్ ను గత నెల ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆయనకంటే సీనియర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి, మరో లెఫ్టినెంట్ జనరల్ పీఎం హారిజ్ ను పక్కన పెట్టి రావత్ ను ఎంపిక చేశారు.