: అమ్మా దీపా, వెంటనే రంగంలోకి దిగు.. శశికళకు చెక్ పెట్టు!: జయలలిత మేనకోడలిపై పెరుగుతున్న ఒత్తిడి!


జయలలిత మేనకోడలు దీపను వెంటనే రాజకీయ రంగంలోకి దిగాలంటూ అన్నాడీఎంకేకు చెందిన పలువురు నేతలు కోరుతున్నారు. ఇప్పటికే పార్టీ పగ్గాలను చేపట్టిన శశికళ... సీఎం పీఠంపై కన్నేసిన నేపథ్యంలో, పార్టీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. శశికళ విషయంలో పార్టీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో, వారంతా దీప ఇంటి వద్దకు క్యూ కడుతున్నారు.

దీప కూడా అచ్చం తన మేనత్త జయలలితలాగానే ఉండటం... ఆమె వ్యాఖ్యలు, హావభావాలు జయలాగానే ఉండటంతో... ఆమెకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. శశికళకు చెక్ పెట్టే దమ్ము, ధైర్యం కేవలం దీపకు మాత్రమే వున్నాయని పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో దీప హాట్ టాపిక్ గా మారారు.

ఇప్పటికే దీప పేరిట వేదికలు కూడా ఏర్పాటవుతున్నాయి. పలు చోట్ల బ్యానర్లు వెలుస్తున్నాయి. టి.నగల్ లోని దీప నివాసానికి ఆమె అభిమానులు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దీప ఇంటికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీప కూడా అందర్నీ అభిమానంగా పలుకరిస్తూ, నమస్కరిస్తూ, ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.

మరోవైపు, దీపను కలవడానికి వచ్చిన వారందరి పేర్లు, చిరునామాలు రాయడానికి పుస్తకం కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజే అభిమానుల పేర్లతో మూడు పుస్తకాలు నిండిపోయాయట. త్వరలో జరగనున్న ఉపఎన్నికలో ఆర్కేనగర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీప మరో పవర్ సెంటర్ గా ఎదుగుతారా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.

  • Loading...

More Telugu News