: జీఎం మోటార్స్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. అమెరికాలోనే కార్లు తయారుచేయాలని హుకుం!
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం జనరల్ మోటార్స్‌కు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆ సంస్థ మెక్సికోలో ఉత్పత్తి చేస్తున్న చెవ్‌రోలెట్ క్రూజ్ కార్లను ఇక నుంచి అమెరికాలోనే తయారుచేయాలని, లేదంటే 'బిగ్ బోర్డర్ ట్యాక్స్' పేరుతో భారీగా పన్నులు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. జనరల్ మోటార్స్ తన చేవీ కార్లను మెక్సికోలో తయారు చేసి అమెరికాలోని డీలర్లకు ఎగుమతి చేస్తోందని ట్విట్వర్ ద్వారా ఆయన తెలిపారు. సరిహద్దు పన్నులు లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇక నుంచి ఈ కార్లను అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని, లేదంటే భారీ పన్నులకు సిద్ధపడాలంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ హెచ్చరికలపై జీఎం మోటార్స్ ఇప్పటి వరకు స్పందించలేదు.