: ముహూర్తం ఖరారు?.. 12న సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం!
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ.. తమిళనాడు ప్రజలకు పవిత్ర దినమైన పొంగల్ పండుగ నాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించనున్నట్టు సమాచారం. ఈనెల 12న సీఎం పగ్గాలను ఆమె చేతిలో పెట్టాలని పార్టీ భావిస్తోంది. ఈమేరకు వేగంగా పావులు కదుపుతున్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలతో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా శశికళకే అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. అనుకున్నట్టే పార్టీ పగ్గాలను అగ్రనాయకత్వం ఆమె చేతిలో పెట్టింది. ఇప్పుడు మిగిలింది సీఎం పీఠమే. దానిని కూడా ఆమెకే అప్పగించాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు.
జయ మృతి తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా పాలన మాత్రం చిన్నమ్మ కనుసన్నల్లోనే జరుగుతోంది. దీనికితోడు శశికళ సీఎం పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ కూడా పార్టీలో ఊపందుకుంది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అయితే శశికళకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఆయనకు మంత్రులు ఆర్పీ ఉదయ్‌కుమార్, సేవూరు రామచంద్రన్, కడంబూరు రాజాలు తోడయ్యారు. శశికళను కలిసి సీఎం పగ్గాలు స్వీకరించాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నారు.
సోమవారం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులు, నేతలు పోయెస్‌గార్డెన్‌లో చిన్నమ్మతో సమావేశమై సీఎం పదవిపై మరోమారు ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈనెలలో జరగనున్న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల నాటికి శశికళను సీఎంను చేయడమే ధ్యేయంగా నేతలు పనిచేస్తున్నారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన తర్వాత రాష్ట్రస్థాయిలో భారీ సమావేశం ఏర్పాటు చేసి సీఎంగా శశికళను ఎన్నుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు ఈనెల 12నే ముహూర్తంగా నిర్ణయించినట్టు సమాచారం.