: తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయాలు.. నేడు రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ త్వరలో ముఖ్యమంత్రి పగ్గాలు చేబట్టనున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో నేడు(బుధవారం) రాష్ట్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మంత్రివర్గ సభ్యులు భేటీ కానున్నారు. కేబినెట్ సమావేశంలో సీఎంపై మార్పుపై వస్తున్న వదంతులపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
కాగా, మరోపక్క నేడు మరిన్ని కీలక సమావేశాలు కూడా జరగనున్నాయి. పార్టీ చీఫ్ శశికళ పార్టీ ప్రధాన కార్యాలయంలో జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే ప్రతిపక్ష డీఎంకే కూడా నేడు సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి రెండు నెలల తర్వాత పార్టీ చీఫ్ కరుణానిధి హాజరుకానున్నట్టు సమాచారం. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు నిర్వాహక అధ్యక్షుడి పగ్గాలు అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే రోజు అధికార, ప్రతిపక్షాలు కీలక సమావేశాలు నిర్వహించడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు వేడి రాజుకుంది.