: ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం.. మెడలోచెప్పుల దండ వేసిన దుండగులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి ప్రకాశం జిల్లాలో అవమానం జరిగింది. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేసి అవమానించారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దండ వేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. జన్మభూమి పనులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.