: బాబాయ్ ని కలిసి ఇన్విటేషన్ ఇస్తా: రాంచరణ్
ఈ నెల 7వ తేదీన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నామని ఆ సినిమా నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపాడు. ఫేస్ బుక్ లో అభిమానులతో లైవ్ ఛాట్ లో పాల్గొన్న రామ్ చరణ్ చాట్ చేస్తూ, తన బాబాయి పవన్ కల్యాణ్ ను స్వయంగా కలిసి ఇన్విటేషన్ ఇస్తానని అన్నాడు. కాగా, పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నాడని, ఫంక్షన్ కు రాడని చరణ్ మామయ్య అల్లు అర్జున్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ప్రకటన మెగా అభిమానుల్లో ఆనందం నింపుతోంది.
కాగా, మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల విరామానంతరం నటించిన సినిమా కావడంతో 'ఖైదీ నెంబర్ 150' పై ఎన్నో అంచనాలున్నాయి. ఈ నెల 7న గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న హాయ్ ల్యాండ్ లో ఈ సినిమా ఏర్పాట్లు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులు హాజరుకానున్నారు. కాగా, ఏర్పాట్లను అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తుండడం విశేషం.