: 'ఉప్ కార్' సినిమాలోని 'కస్మే వాదే' పాటపాడిన శివపాల్ యాదవ్
గతంలో బాలీవుడ్ లో వచ్చిన 'ఉప్ కార్' సినిమాలో మన్నాడే పాడిన 'కస్మే వాదే' పాటను సమాజ్ వాదీ పార్టీ నేత, ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఉప్ కార్' సినిమా కథ అచ్చం సమాజ్ వాదీ పార్టీ అధినేత కుటుంబంలో చోటుచేసుకుంటున్నట్టే ఉంటుంది. 1967లో మనోజ్ కుమార్ తీసిన ఈ సినిమాలో వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి కోసం స్వార్థపరులైన తనయులు, అత్యాశపరులైన బాబాయిలు పోట్లాడుకుంటారు. అచ్చం అందులోలానే సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శివపాల్ యాదవ్ మీడియాకు ఇచ్చిన విందు సందర్భంగా మీడియా ప్రతినిధుల కోరికమేరకు 'కస్మే వాదే' పాటపాడి ఆకట్టుకున్నారు.