: తల్లికి సరైన చికిత్స చేయలేదంటూ వైద్యులను చితకబాదిన కర్ణాటక ఎమ్మెల్యే!
అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ ముగ్గురు వైద్యులను కర్ణాటక ఎమ్మెల్యే అనంత్ కుమార్ హెగ్డే చితకబాదారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో కార్వార్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ వైద్యులు మధుకేశ్వరజీవి, బాలచంద్ర, రాహుల్ మర్షకర్ పై ఎమ్మెల్యే దాడి చేశారు. దీంతో, వైద్యులకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన సీసీటీవీలో రికార్డు అయింది. అయితే, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. కాగా, తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అనంత్ కుమార్, ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.