: కర్ణాటక హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. వారిని కటకటాల వెనక్కి పంపాల్సిందే: కిరణ్ రిజిజు
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బెంగుళూరు వీధుల్లో యువతులను అల్లరి మూకలు వేధించిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక హోంమంత్రి మాట్లాడుతూ, ఆ సమయంలో యువతులు పాశ్చాత్య దుస్తులను ధరించారని... ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. కర్ణాటక హోంమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని కిరణ్ తెలిపారు. యువతుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన వారిని గుర్తించి, కటకటాల వెనక్కి పంపాల్సిందేనని చెప్పారు. ఈ ఘటనపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా స్పందిస్తూ... హోంమంత్రి వ్యాఖ్యలు వారి చెత్త పాలనకు నిదర్శనమని అన్నారు. దుస్తులు, వేధింపుల గురించి ఆయన చేసిన కామెంట్లు హేయమైనవని చెప్పారు. మరోవైపు హోంమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.