: కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించాం!: పవన్ కల్యాణ్
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు జనసేన చేయబోయే పనులు ఏంటన్న విషయమై పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఇప్పటికే జనసేన జిల్లా కమిటీతో కూర్చుని మాట్లాడానని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఓ కమిటీని నియమించినట్టు వెల్లడించారు. ఇక్కడి పేదలకు దీర్ఘకాలంగా చికిత్సలు చేస్తున్న వైద్యులు కృష్ణమూర్తి, దుర్గా ప్రసాద్ లను సైతం కమిటీలో చేరాలని ఆహ్వానించారు. వీరు కమిటీతో పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి సలహా, సూచనలను ఇవ్వాలని జనసేన తరఫున కోరుతున్నట్టు తెలిపారు.
"ఈ రోజున ప్రతిదానికి ఆర్థిక పరమైన సమస్యే ఉంది. ప్రభుత్వాన్ని అడిగితే, నిధులు లేవంటారు. నేనీ రోజున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అడిగేంది ఏంటంటే, ఈ సమస్య ఓ విపత్తు. ఒక ప్రాంతంలో వేలాది మంది, దశాబ్దాలుగా చనిపోతున్నా ఏ ఒక్క ప్రజా ప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్లలేదు? ఒకవేళ వెళ్లినా, దీన్నెందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. మీరు దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజల ముందుకు వచ్చి, సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో ఎందుకు వెనక్కు వెళ్లిపోతున్నారో అర్థం కావడం లేదు" అంటూ పవన్ విమర్శలు గుప్పించారు.