: జల్లికట్టు’కు అనుమతి కోరుతూ ఆందోళన చేపట్టనున్న విజయకాంత్
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును ఆ రాష్ట్రంలో రెండేళ్లుగా నిర్వహించట్లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అయినా ఈ క్రీడను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆందోళనకు దిగనున్నారు. ఈ నెల 9వ తేదీన అలంగానల్లూరులో ఆందోళన చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. లంగానల్లూరు, వడివాసల్ సమీపంలో ఉదయం పది గంటలకు జల్లికట్టు జరపాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న భారీ ఆందోళనకు తాను నేతృత్వం వహించనున్నానని పేర్కొన్నారు. ఈ క్రీడను నిర్వహించేందుకు యువకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ ఏడాది జల్లికట్టు జరుగుతుందని ప్రకటనలు ఇస్తున్నారని, అయితే, దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాలని విజయకాంత్ డిమాండ్ చేశారు.