: టెలినార్‌పై ఎయిర్‌టెల్ కన్ను.. 350 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు
భారత్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే వినియోగదారులను తనవైపు తిప్పుకున్న నార్వే టెలికం సంస్థ టెలినార్‌ను సొంతం చేసుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్ పావులు కదుపుతోంది. 350 మిలియన్ డాలర్లతో దానిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం టెలినార్‌తో చర్చలు కూడా జరుపుతోంది. టెలినార్ ఇండియా రుణంలో సగం చెల్లించడం ద్వారా ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరునాటికే ఈ డీల్ పూర్తి కావచ్చని చెబుతున్నారు.
ప్రత్యర్థుల నుంచి తీవ్రంగా ఎదురవుతున్న పోటీ, డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాల కారణంగా భారత్ మార్కెట్‌కు టాటా చెప్పాలని భావించిన టెలినార్ ఇండియా గతంలో ఐడియాతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వానికి టెలినార్ రూ.1900 కోట్లు, రుణాల రూపంలో బ్యాంకులకు మరో రూ.1800 కోట్లు బకాయి పడింది. దీంతో ఈ రుణ భారంలో సగం చెల్లించడం ద్వారా దానిని సొంతం చేసుకోవాలని ఎయిర్‌టెల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. టెలినార్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అలాగే 7 సర్కిళ్లలో 4 జీ సేవలు అందిస్తుండగా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర ఆరు సర్కిళ్లలో 2 జీ సేవలు అందిస్తోంది.