: ఆ రైళ్లలో ప్రయాణించేటప్పుడు జర భద్రం.. బెర్తుల్లోంచి అకస్మాత్తుగా కిందపడిపోగలరు!
హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కాకినాడ టౌన్ గౌతమీ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-కోల్‌కతా షాలిమార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి చిన్న హెచ్చరిక. ఈ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి. రైలు నడుస్తుండగా అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న మీరు అకస్మాత్తుగా కిందపడిపోవచ్చు. ఒక్కసారిగా భారీ కుదుపులతో ప్రమాదం జరిగిందన్న భయం మీ వెన్నులో పుట్టొచ్చు. దీనికి కారణం ఆ రైళ్ల కప్లింగ్‌లో ఉన్న లోపాలు! బోగీని, బోగీని కలిపి ఉంచే ఈ కప్లింగులు ఇప్పుడు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి.
గతంలో బోగీలను కలిపే స్క్రూ కప్లర్ల స్థానంలో కొత్తగా సెంటర్ బఫర్ కఫ్లర్ల (సీబీపీ)లను ఏర్పాటు చేయడంతో ఈ సమస్య మొదలైంది. పాత కఫ్లర్లలో ఉండే కుషన్ విధానం సీబీపీలో లేకపోవడమే ప్రస్తుత ఇబ్బందులకు కారణం. పాత కఫ్లర్లలో కుషన్ విధానం ఉండడం వల్ల రైలు వేగం పెరిగినా, బ్రేకు వేసినా ఏర్పడే ఘర్షణను అది అడ్డుకునేది. ఫలితంగా కుదుపులు ఉండేవి కావు. కానీ సీబీపీలో కుషన్ విధానం లేకపోవడం వల్ల బ్రేకు వేసినప్పుడు, రైలు వేగం పుంజుకున్నప్పుడు కప్లర్లు ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయి.
ఫలితంగా బోగీలు భారీ కుదుపులకు గురవుతున్నాయి. ఒక్కోసారి ప్రమాదం జరిగిందేమోనన్న అనుమానం కలిగించేలా ఉంటున్నాయి. అంతేకాదు, బెర్తుల్లో నిద్రిస్తున్నవారు కిందపడి గాయాలపాలైన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వో బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాత కఫ్లర్ల స్థానంలో కొత్తవాటిని అమర్చాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. సీబీపీ డిజైన్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కొత్త వాటిని తయారు చేయించే పనిలో పడ్డారు.