: 'ఇలాంటి ఘటనలు మామూలేనంటూ' కొట్టిపారేసిన బెంగళూరు మంత్రి
బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి అమ్మాయిలపై మందుబాబుల అసభ్య ప్రవర్తన గురించి హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వరను మీడియా ప్రశ్నించగా, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకునే సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం మామూలేనంటూ తేలికగా కొట్టిపారేశారు. పోలీసులు ఉండగానే, అమ్మాయిలపై వారు వేధింపులకు పాల్పడ్డారనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, న్యూ ఇయర్ వేడుకల సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం దురదృష్టకరమని, ఆ రోజున అక్కడ ఉన్న యువత అంతా, పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్న వారేనని, వారి ఆలోచనలు మాత్రమే కాదు, వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా పాశ్చాత్య ధోరణిలో ఉందని అన్నారు.
అందుకే, అమ్మాయిలను వారు వేధించారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, మంత్రి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై మంత్రి వెంటనే సమాధానం చెప్పాలని, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పరమేశ్వరను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.