: ములాయం నన్ను తన హృదయంలో నుంచి తీసేస్తేనే బాధపడతా.. మరి దేనికీ కాదు!: అమర్ సింగ్
ములాయం సింగ్ యాదవ్ తన హృదయంలోంచి తనను తీసేస్తే బాధపడతాను కానీ, పార్టీ నుంచి తొలగిస్తే మాత్రం బాధపడనని సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ అన్నారు. లండన్ పర్యటన నుంచి ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తనను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించడంపై స్పందిస్తూ, ములాయం సింగ్ తో అనుబంధం తనను హీరోను చేసిందని, తాను ఆయనతోనే ఉంటానని, అవసరమైతే విలన్ గానూ మారతానని అన్నారు.
తాను ములాయం హృదయంలో ఉన్నానని, పార్టీలో కాదని ములాయం సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాగా, సీఎం అఖిలేశ్ యాదవ్ ను నిన్న పార్టీ ప్రతినిధులు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ నేతలు అయిన శివపాల్ యాదవ్, అమర్ సింగ్ లను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు అఖిలేశ్ ప్రకటించడం, ఈ ప్రకటన అనైతికమని, చెల్లదని ములాయం సింగ్ ఖండించడం తెలిసిందే!