: పాతనోట్లతో వచ్చే ఎన్ఆర్ఐ లకు ‘కస్టమ్స్’ అనుమతి తప్పనిసరి: ఆర్బీఐ
రద్దయిన పెద్దనోట్లతో ఇక్కడికి వచ్చే ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) ఆయా విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల నుంచి అనుమతి పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ నిబంధనలు 2015 ప్రకారం, ఒక వ్యక్తి కేవలం రూ.25 వేల విలువైన పాతనోట్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉందన్నారు. సదరు ధ్రువీకరణ పత్రాన్ని నిర్దేశిత ఆర్బీఐ శాఖల్లో చూపి పాతనోట్లను ఎన్ఆర్ఐ లు జమ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.
అయితే, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో ఉంటున్న ఎన్ఆర్ఐలకు ఈ సౌకర్యం వర్తించదు. ఎన్ఆర్ఐ లు తెచ్చే పాత నోట్లను లెక్కించి, ఆయా పత్రాల్లో పొందుపరచిన అనంతరం స్టాంప్ వేయాలని కస్టమ్స్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, నోట్ల రద్దు ప్రకటన అమల్లోకి వచ్చిన నాటి నుంచి విదేశీ పర్యటనలో ఉండి గత ఏడాది డిసెంబర్ 30 లోపు నగదు మార్పిడి చేసుకోలేని భారతీయులు ఈ ఏడాది మార్చి 31 వ తేదీలోగా మార్చుకోవచ్చు.