: రేపు ఏపీలో పర్యటించనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీ రేపు ఏపీ పర్యటనకు వస్తున్నారు. తిరుపతిలో జరిగే 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
సైన్స్ కాంగ్రెస్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఆ తర్వాత నోబెల్ గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొనడానికి 10,500 మంది రిజిస్టర్ చేసుకోగా... వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరవుతున్నారు. రేపటి నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరగనుంది.