: ఇంట్లో పూలకుండీల్లో గంజాయి మొక్కల పెంపకం!
ఎక్కడో అడవుల్లో రహస్యంగా జరిగే గంజాయి సాగు హైదరాబాదు నడిబొడ్డున ఓ వ్యక్తి ఇంట్లో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. అదికూడా హైటెక్ అపార్ట్ మెంట్ లో జరుగుతున్న గంజాయి సాగు అధికారులను ఆశ్చర్యానికి లోనుచేసింది. వివరాల్లోకి వెళ్తే, గోల్కొండలోని వైకే రెసిడెన్సీలో గంజాయి సాగును సయ్యద్ అనే వ్యక్తి చేపట్టాడు. గంజాయిని బయట పెంచితే అనుమానం వస్తుందని భావించిన సయ్యద్ తన అపార్ట్ మెంట్ లోని ఓ రూంలో గంజాయి సాగు చేపట్టాడు.
మొత్తం 60 పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచాడు. ప్రతికూల వాతావరణంలో గంజాయి మొక్కలు పెరగవని భావించిన సయ్యద్ వాటిని పెంచేందుకు ఆ రూంలో ఏసీ, హీటర్లు పెట్టి వాతావరణ మార్పులు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నాడు. అంతే కాదు, పక్వానికి వచ్చే గంజాయి మొక్కల నుంచి వాసన బయటకు రాకుండా ఉండేందుకు కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్నాడు. అయితే, తాజాగా ఈ గుట్టు బయటపడడంతో, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ అపార్ట్ మెంట్ పై దాడి చేసి సయ్యద్ ను అరెస్ట్ చేసి, 60 కుండీల్లో పెంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.