modi: వారు 'మోదీ హఠావో' అంటున్నారు.. నేను 'నల్లధనం హఠావో' అంటున్నాను: ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రాష్ట్ర ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ నేతలు కలిసి ‘మోదీ హఠావో’ అని అంటున్నారని, తాను మాత్రం నల్లధనాన్ని, అవినీతిని హఠావో అని అంటున్నానని మోదీ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ 'సూర్యుడు ఉదయిస్తున్నాడు' అంటే.. బహుజన్ సమాజ్ పార్టీ 'సూర్యుడు అస్తమిస్తున్నాడ'ని వాదిస్తుందని, కానీ ఇప్పుడు మాత్రం ఆ రెండు పార్టీలు కలిసి 'మోదీ హఠావో' అంటూ మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. అటువంటి పార్టీలు అభివృద్ధిని ఎలా చేసి చూపిస్తాయని ఆయన ప్రశ్నించారు. అలాంటి పార్టీలు యూపీని రక్షిస్తాయా? అని అన్నారు.
నిజాయతీ పరులు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలను సహించాలా? అని మోదీ ప్రశ్నించారు. తన జీవితంలో ఇంతపెద్ద సభ ఎన్నడూ చూడలేదని అన్నారు. ఇలాంటి సభలో ప్రసంగించడం ఒక అదృష్టమని చెప్పారు. యూపీని రక్షించేది బీజేపీ ఒక్కటేనని అన్నారు. 14 ఏళ్లపాటు యూపీ అభివృద్ధికి దూరమైందని, ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండని పిలుపునిచ్చారు. తమకు ప్రజలే హై కమాండ్ అని వేరెవ్వరూ లేరని మోదీ అన్నారు.