: పెద్దలతో మరో యుద్ధానికి సిద్ధమైన హీరో విశాల్
తమిళ సినీరంగంలో సంచలన నటుడుగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్ మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే నడిగర్ సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అప్పటి వరకు పెత్తనం సాగించిన సినీ పెద్దలను ఇంటికి సాగనంపాడు విశాల్. తెలుగువాడి పెత్తనం నడిగర్ సంఘంలో ఏమిటంటూ రాధికలాంటి వాళ్లు ప్రశ్నించినా... ప్రత్యర్థి ప్యానెల్ ను విశాల్ ప్యానెల్ చిత్తు చేసింది. ఇప్పుడు తాజాగా నిర్మాతల మండలి ఎన్నికలకు ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 5న నిర్మాతల మండలి నూతన కార్యవర్గం ఎన్నికలు జరగనున్నాయి. సీనియర్ నిర్మాత కలైపులి ఎస్ థాను నేతృత్వంలోని కమిటీ ఇప్పుడు కొలువై ఉంది. ఈ కమిటీపై పలువురు అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో, నడిగర్ సంఘం ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విశాల్... నిర్మాతల సంఘం ఎన్నికల్లో సైతం బరిలోకి దిగుతున్నామంటూ సంచలన ప్రకటన చేశాడు. తమ కూటమి తరపున సీనియర్ నటి, నిర్మాత అయిన ఖుష్బూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ప్రకటించాడు. ఇతర పదవులకు పోటీ చేయబోయే వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.