: పుల్లుగా తాగి గన్‌తో హల్‌చల్ చేసిన నేతల కుమారులు.. జూకల్‌లో రైతు నుదిటిపై తుపాకి గురిపెట్టి చంపేస్తామని బెదిరింపు!
న్యూ ఇయర్ వేడుకలను సెలెబ్రేట్ చేసుకునేందుకు కార్లలో శంషాబాద్ మండలంలో జూకల్‌లోని గ్రీన్ హోం వెంచర్‌కు చేరుకున్న కొందరు నేతల కొడుకులు అక్కడ గన్‌తో హల్‌చల్ చేశారు. ఓ రైతు కణతపై తుపాకి గురిపెట్టి చంపేస్తామని బెదిరించడం కలకలం రేపింది. డిసెంబరు 31న రాత్రి పదిమంది యువకులు ఫాం హౌస్‌కు చేరుకుని వేడుకల్లో మునిగిపోయారు. రాత్రి 11:30 గంటల సమయంలో జూకల్‌కు చెందిన కొందరు యువ రైతులు గ్రీన్ హోం వెంచర్ మీదుగా తమ పొలాలకు వెళ్తున్నారు. వీరిని చూసిన మద్యం మత్తులో ఉన్న యువకులు రైతులను అడ్డుకున్నారు. ఇటువైపు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తమ పొలాలు ఇటువైపే ఉన్నాయని, అక్కడకు వెళ్లేందుకు ఇదొక్కటే దారి అని చెబుతున్నా వినలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
అంతలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు జేబులోంచి తుపాకి తీసి శ్రీకాంత్‌రెడ్డి అనే యువ రైతు నుదిటిపై గురిపెట్టాడు. తాను ఎమ్మెల్యే కొడుకునని, ఏం చేస్తారో చేసుకోండని హెచ్చరించాడు. దీంతో రైతులు తుపాకిని లాక్కున్నారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఖలీల్ పాషాకు తుపాకిని అప్పగించారు. ఈ ఘటనపై బాధిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వెనక జూకల్‌కు చెందిన ఓ నేత హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎస్సై ఖలీల్ పాషా మాట్లాడుతూ యువకులు గురిపెట్టినది బొమ్మ తుపాకి అని కొట్టి పారేశారు.