: ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌కు కళ్లు చెదిరే ఆస్తులు.. గుర్తించిన ఎన్ఐఏ
వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌కు ఉన్న ఆస్తులను గుర్తించిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఢాకా పేలుళ్ల తర్వాత విదేశాలకు వెళ్లిన జకీర్ నాయక్ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. మత బోధనల పేరుతో యువకులను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకున్న ఆయనకు దేశంలోని 37 ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. ఒక్క ముంబైలోనే 25 విలాసవంతమైన ప్లాట్లు ఉన్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. మజ్గావ్, జేజే ఆస్పత్రి, డోంగ్రీ తదితర ప్రాంతాలతోపాటు పుణే, సోలాపూర్‌లోనూ ఆయనకు విలువైన ఆస్తులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మార్కెట్లో వీటి విలువ వందకోట్ల రూపాయలకు పైమాటేనని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. మతబోధనలే తన లక్ష్యమని చెప్పుకునే జకీర్ నాయక్‌కు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.