: గడువు ముగిసినా ఆగని పాత నోట్ల మార్పిడి దందా.. విశాఖలో రూ.47 లక్షలు స్వాధీనం
పాత నోట్ల జమ గడువు ముగిసినా నోట్ల మార్పిడి వ్యవహారం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రద్దయిన పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చే ముఠాలు ఇంకా చురుగ్గానే పనిచేస్తున్నాయి. విశాఖపట్టణంలో పాత నోట్లను మార్పిడి చేస్తూ కొందరు అక్రమార్కులు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. నగరంలోని శంకరమఠం రోడ్డులో రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలోని పవన్ ఎస్టేట్స్‌లోని ఓ ఫ్లాట్ లో నగదు మార్పిడి జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌పోలీసులు దాడి చేయడంతో ఈ బండారం బట్టబయలైంది.
ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి రూ.47 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.46 లక్షల విలువైన కొత్త రూ.2 వేల నోట్లు ఉన్నాయి. పోలీసులకు పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో ఒకరు వైద్యుడు కాగా, మిగిలిన ఇద్దరు బ్రోకర్లు అని పోలీసులు తెలిపారు. ఇప్పటికే పాత నోట్లను తీసుకున్న వీరు 30 శాతం కమిషన్‌తో కొత్త నోట్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా ఇప్పటికే రూ.50 లక్షల వరకు మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పట్టుబడిన రూ.46 లక్షల విలువైన కొత్త నోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులు, పోస్టాఫీసు సిబ్బంది పాత్రపై విచారణ జరుపుతున్నట్టు ఏసీపీ చిట్టిబాబు తెలిపారు.