: పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధర.. విమాన ఇంధన ధరలు కూడా!
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఫ్) ధరతో పాటు ఎల్‌పీజీ సిలిండర్ ధర మరింత పెరిగింది. విమాన ఇంధన ధరలు ఇప్పుడున్న దానికి 8.6 శాతం పెరగగా, సిలిండర్ ధర రూ.2 పెరిగింది. ఏడు నెలల కాలవ్యవధిలో గ్యాస్ ధర ఇప్పటికీ ఎనిమిదిసార్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం రూ.432.71గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.434.71కి చేరుకుంది. ఈ ఏడాది జూన్‌లో గ్యాస్‌పై సబ్సిడినీ తగ్గించాలని కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతీ నెల ఒకటో తారీఖున ఏటీఎఫ్ గ్యాస్ సబ్సిడీని ఫారెన్ ఎక్స్ఛేంజీ రేటు ఆధారంగా పెంచుతూ వస్తున్నారు.
గ్యాస్, కిరోసిన్‌పై సబ్సిడీలను తొలగించేందుకు డీజిల్ విధానాలనే అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో భాగంగా ప్రస్తుతం ధరలను పెంచారు. కిరోసిన్ ధరలను కూడా ప్రతి ఏడాది 0.25 పైసలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముంబయిలో కిరోసిన్ ధర లీటరుకి రూ.18.28గా ఉంది. మరోవైపు ఢిల్లీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. దీంతో అక్కడ సబ్సిడీ కిరోసిన్ అమ్మకాలు ఆగిపోయాయి.