: ప్రతిపక్ష నేతలు ఏం చేయాలో తోచని అయోమయ పరిస్థితిలో ఉన్నారు: వెంకయ్య నాయుడు
దేశ ప్రజలకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పేదలకు తక్కువ రేట్లకు వడ్డీ అందుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల పాలిట పెన్నిధని ఆయన అన్నారు. పేదల సంక్షేమం, బంగారు భవిష్యత్తు కోసం ప్రధాని బాటలు వేశారని ఆయన చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పేదల సంక్షేమం కోసం ఎన్నో ఆలోచనలు చేశారని ఆయన అన్నారు. పేదల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలతో మోదీ మరింత పాప్యులారిటీ సంపాదించుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు భయపడిపోతున్నాయని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతిపక్ష నేతలకు ఏం చేయాలో తోచక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతలు నిరాశ, నిస్పృహలకు గురయ్యారని, దీంతో ఏం చేయాలో తోచని అయోమయ పరిస్థితిలో, వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడుతున్నారని చెప్పారు. పేద, గ్రామీణ ప్రజలను ఆదుకోవడమే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు.