: నాన్నా, మీరు దిగిపొమ్మని ఆదేశిస్తే తప్పుకుంటా... శివపాల్ ను మాత్రం ఉండనిచ్చేది లేదు: స్పష్టం చేసిన అఖిలేష్


తన తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆదేశిస్తే, తాను జాతీయ అధ్యక్షునిగా తప్పుకుంటానని, ఆ పదవిలో తన బాబాయ్ శివపాల్ యాదవ్ ను మాత్రం కొనసాగించే పరిస్థితే లేదని యూపీ సీఎం అఖిలేష్ కుండబద్దలు కొట్టారు. "నేతాజీ ఆదేశిస్తే ఈ పదవి నుంచి తప్పుకుంటా. పార్టీని భ్రష్టు పట్టిస్తున్న వారికి అందలం కట్టబెడతానంటే మాత్రం, పార్టీలో అత్యధికుల నిర్ణయం ఏదైతే అదే నా నిర్ణయం అవుతుంది. పక్కనే ఉండి సంక్షోభాన్ని సృష్టిస్తున్న వారిని దూరం పెట్టాలి. వారు తమ దుష్ట ఆలోచనలతో నేతాజీ మనసును ప్రభావితం చేస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెడుతున్నారు.

రైతులు, యువత, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయి. శివపాల్ టికెట్లను ఆఫర్ చేసిన వారిని పోటీ చేయనిస్తే వారికి ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన తన స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు. పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతుంటే చూస్తూ ఊరుకోలేను. నాన్నా, మీరు ఆదేశిస్తే ఈ పదవి నుంచి ఈ క్షణమే దిగిపోతాను. అందులో సందేహం లేదు" అని అఖిలేష్ వ్యాఖ్యానించారు.

నేతాజీతో సమానమైన వారు పార్టీలో మరెవరూ లేరని, తన మద్దతు ఎప్పుడూ ఆయనకేనని స్పష్టం చేసిన అఖిలేష్, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే చూస్తూ ఎలా ఉండగలనని ప్రశ్నించారు. శివపాల్ ను, అమర్ సింగ్ ను దూరం పెడితే, మొట్టమొదట సంతోషించే సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తను తానేనని చెప్పారు. తాను ముఖ్యమంత్రినైనా, పార్టీ అధ్యక్షుడినైనా, అంతకన్నా ముందు నేతాజీకి కుమారుడినని అన్నారు. తమ మధ్య బంధాన్ని ఎవ్వరూ తెగ్గొట్టలేరని, నేతాజీ ఆశయ సాధనే తన ప్రధాన కర్తవ్యమని వెల్లడించారు.

  • Loading...

More Telugu News