: ములాయం శకం ముగిసినట్టేనా?... సమాజ్ వాదీలో తిరుగులేదని నిరూపించుకున్న అఖిలేష్ యాదవ్!
2016 చివరి రోజుల్లో సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం కొత్త సంవత్సరం రాకముందే సమసిపోయింది. సమాజ్ వాదీ పార్టీలో తనకు తిరుగులేదని అఖిలేష్ యాదవ్ నిరూపించుకోగా, పార్టీ అధినేత, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ శకం ముగిసినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం నాడు ఎమ్మెల్యేల బల ప్రదర్శన సాగిన వేళ, మొత్తం 229 మంది ఎమ్మెల్యేల్లో 200 మందికిపైగా అఖిలేష్ కు మద్దతిచ్చారు. అఖిలేష్ తన ఎమ్మెల్యేలతో సమావేశమైన కాసేపటికి, అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పార్టీ చీఫ్ ములాయం నిర్వహించిన సమావేశానికి కేవలం 20 మంది శాసన సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో తనకున్న రాజకీయ అనుభవంతో పరిస్థితిని అంచనా వేసిన ములాయం వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే.
అఖిలేష్ కు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కాదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లు వెన్నుదన్నుగా నిలిచారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం అఖిలేష్ వెంట నడుస్తామన్న సంకేతాలను పంపింది. దీంతో మధ్యాహ్నానికే పరిస్థితి మారిపోగా, సాయంత్రానికి అఖిలేష్, రాంగోపాల్ యాదవ్ లపై క్రమశిక్షణా చర్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ములాయం ప్రకటించాల్సి వచ్చింది.
ప్రస్తుతానికి సద్దుమణిగినప్పటికీ, దాదాపు నాలుగు నెలల నుంచి సమాజ్ వాదీ కుటుంబంలో సాగుతున్న వివాదపు తుపాను సమసిపోయినట్టు భావించలేమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం సమావేశమైన అఖిలేష్ బ్యాచ్, ఆయన్ను తమ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇక ప్రస్తుతం కలిసినట్టు కనిపిస్తున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాల నుంచి ములాయం తప్పుకుని అఖిలేష్ కు పూర్తి స్థాయి పగ్గాలను అప్పగిస్తేనే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయన్న అభిప్రాయాన్ని సమాజ్ వాదీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ములాయం తప్పుకోవాలన్న సంకేతాలను పంపుతున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక టికెట్లను అఖిలేష్ యాదవ్ సూచించిన వారికే ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేయడంతో పాటు, ఆ మేరకు ములాయం నుంచి హామీని కూడా పొందినట్టు తెలుస్తోంది.
ఇక పార్టీలో ప్రభావం చూపుతున్న అమర్ సింగ్ వంటి బయటి వ్యక్తుల ప్రమేయాన్ని తగ్గించాలని కూడా అఖిలేష్ వర్గం డిమాండ్ చేస్తోంది. తామంతా కలసికట్టుగా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతామని శివపాల్ యాదవ్ చెప్పినప్పటికీ, పార్టీలో క్రమంగా ఆయన ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనే అఖిలేష్ వర్గం కృత నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తుంటే సాధ్యమైనంత తొందర్లోనే సమాజ్ వాదీ పగ్గాలను అఖిలేష్ కు అప్పగిస్తూ, ములాయం స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.