: శుభవార్త... గ్రీన్ కార్డు పరీక్షలను సులభం చేసిన అమెరికా


ఈబీ-2 కేటగిరీలో గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారికి మరింత సులభంగా అనుమతులు లభించనున్నాయి. ఈ మేరకు అమెరికా అధికారులు గ్రీన్ కార్డు జారీ పరీక్షలను సరళీకృతం చేశారు. అడ్వాన్డ్స్ డిగ్రీ లేదా ఈబీ-2 కేటగిరీలో నైపుణ్యవంతులకు ఎన్ఐడబ్ల్యూ (నేషనల్ ఇంట్రస్ట్ వేయర్) లభించేందుకు మరింత అవకాశం ఏర్పడింది. ఎన్ఐడబ్ల్యూ లభించిన వారికి గ్రీన్ కార్డు వేగంగా లభిస్తుందన్న సంగతి తెలిసిందే.

తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓ మైలురాయని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా శాశ్వత ఉద్యోగం ఆఫర్, లేబర్ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఈబీ-2 కేటగిరీ కింద ఎన్ఐడబ్ల్యూ ఉంటే, లేబర్ సర్టిఫికెట్ లేకుండానే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సాధారణంగా లేబర్ సర్టిఫికెట్ పొందాలంటే, సదరు వ్యక్తి చేస్తున్న ఉద్యోగం చేసేందుకు అమెరికా వర్కర్లు అందుబాటులో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తారు. యాజమాన్యం కూడా ఆ పని చేసేందుకు అమెరికన్లు అందుబాటులో లేరని వెల్లడించాల్సి వుంటుంది. ఈ విధానం అమెరికా రక్షణాత్మక ధోరణికి నిదర్శనం కాగా, పలు దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో ఉద్యోగి మెరిట్, విద్యార్హతలు, ప్రవర్తన ఆధారంగా యూఎస్ సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) ఎన్ఐడబ్ల్యూను జారీ చేయవచ్చన్న ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో ఎంటర్ ప్రెన్యూర్ లకు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవలందిస్తున్న వారితో పాటు ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ రంగాల్లోని వారికి సులువుగా గ్రీన్ కార్డు లభిస్తుందని ఎన్పీజడ్ లా గ్రూప్ మేనేజింగ్ అటార్నీ డేవిడ్ హెచ్ నాచ్ మన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News