: ఎత్తుల్లో తండ్రిని మించిన తనయుడు... అఖిలేష్ బలం ముందు తలొగ్గిన ములాయం!


యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ చూపిన బలం ముందు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ఎత్తుగడలు పారకపోవడంతో, తన కుమారుడిపై విధించిన సస్పెన్షన్ ను ములాయం తొలగించిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య కేవలం 24 గంటల వ్యవధిలోనే కుమారుడి సస్పెన్షన్ పై ములాయం యూ టర్న్ తీసుకోవడానికిగల కారణాలు, ఎందుకు ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్న అంశంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.

మొత్తం 229 మంది సమాజ్ వాదీ ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 200 మందికి పైగా ఎమ్మెల్యేలు అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై సస్పెన్షన్ కొనసాగితే, పార్టీని చీల్చి, తమదే అసలైన సమాజ్ వాదీ పార్టీ అని చెబుతూ, ప్రభుత్వాన్ని కొనసాగించే దిశగా అఖిలేష్ అడుగులు వేయడం ఖాయంగా కనిపించింది. పలువురు సీనియర్ నేతలు సైతం అఖిలేష్ వెంటే నిలిచారు.

ఇదే సమయంలో సీఎంపై విధించిన సస్పెన్షన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ, తన ఇంటి ఎదుట యువత చేసిన గొడవ కూడా ములాయం మనసు మార్చింది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత ఆయన వెనకే ఉన్నారన్న సంకేతాలను చూసిన ములాయం, కుమారుడిని మరింత దూరం పెట్టడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ మంత్రాంగం సైతం ఫలించింది.

మంచిగా నడుస్తున్న ప్రభుత్వాన్ని, చేతిలోని అధికారాన్ని వదులుకోవద్దని, ఎన్నికలకు ముందు విడిపోయి ప్రతిపక్షాల బలాన్ని పెంచవద్దని, ఓట్లు చీలేలా చేసుకోవద్దని ఆయన తీసుకున్న క్లాస్ ములాయం సింగ్ ను పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోదరుడికన్నా కుమారుడే మిన్న అన్న నిర్ణయానికి ములాయం వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News