: సూర్యనమస్కారం ఇస్లాంలో నిషేధం...ఎందుకు చేశావ్?.. అంటూ నిప్పులు చెరిగిన నెటిజన్లు!
సూర్యనమస్కారం చేసి ఇస్లాం సంస్కృతీ సంప్రదాయాలను మంటగలిపావంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. దానికి కారణమేంటంటే, మహ్మద్ కైఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో సూర్యనమస్కారానికి సంబంధించిన ఫోటోలు పోస్టు చేయడమే. ఆ ఫోటోలను చూసిన పలువురు ఇస్లాం అనుచరులు కైఫ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సూర్యనమస్కారం చేయడం ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధమని తెలియదా? అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, మరో నెటిజన్ 'సూర్యనమస్కారం చేయడం ఇస్లాంలో నిషేధం' అని స్పష్టం చేశాడు.
ఇలాంటి ఫోటోలు ఎందుకు పోస్టు చేశావంటూ మరో నెటిజన్ నిలదీశాడు. దీనికి 'సూర్య నమస్కారం అన్నది పూర్తిగా భౌతిక వ్యవస్థ పనితీరుకు సంబంధించినది. ఏ పరికరం లేకుండా ఎక్సర్ సైజ్ చేసే పద్ధతి ఇది. నా హృదయంలో అల్లా ఉన్నాడు, సూర్యనమస్కారం చేసినా, జిమ్ లో కసరత్తులు చేసినా అందరికీ ఉపయోగమే' అని కైఫ్ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా, కొన్ని రోజుల ముందు మరో క్రికెటర్ షమీ భార్య స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగగా, కైఫ్ అండగా నిలబడ్డ సంగతి తెలిసిందే. ఇస్లామేతరులు మాత్రం కైఫ్ ను ప్రశంసించడం విశేషం. ఫిట్ నెస్ పై అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు.