: పాక్ మాజీ క్రికెటర్ ఇంతియాజ్ అహ్మద్ మృతి
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంతియాజ్ అహ్మద్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన లాహోర్ లో ఈ రోజు కన్నుమూశారు. 1952 నుంచి 1962 వరకు పాక్ జట్టుకు ఇంతియాజ్ ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 41 టెస్టులు ఆడిన ఆయన 2,079 పరుగులు చేశారు. నాలుగు టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. కీపర్ గా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ 77 క్యాచ్ లు, 16 స్టంపింగులు చేశారు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 209 పరుగులు. 1955లో లాహోర్ లో న్యూజిలాండ్ పై ఈ డబుల్ సెంచరీ సాధించారు. అంతేకాదు, భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోక ముందు నార్తర్న్ ఇండియా జట్టు తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారు ఇంతియాజ్. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత 13 ఏళ్ల పాటు సెలెక్టర్ గా సేవలందించారు. 1976 నుంచి 1978 వరకు చీఫ్ సెలక్టర్ గా పని చేశారు.