: నెల్లూరులో ఘోరం... బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ముగ్గురి మృతి
నెల్లూరు శివారులో ఈ ఉదయం ఘోరం జరిగింది. పొర్లుకట్ట ప్రాంతంలో బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నారు.
ఘటన గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండటంతో వాటిని ఆర్పివేయడం కష్టంగా ఉంది. ఇక్కడి ఫ్యాక్టరీకి సరైన అనుమతులు లేవని వెల్లడించిన పోలీసులు సహాయక చర్యలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పొర్లుకట్ట వద్ద ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలను తీసివేయాలని స్థానికులు పలుమార్లు నిరసనలు నిర్వహించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి వుంది.