: ములాయం ప్లాన్ విఫలమేనా? అఖిలేష్ వెంటే అత్యధిక ఎమ్మెల్యేలు!!
తన కుమారుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించి, తన మాట వినే మరొకరిని సీఎం పదవిలో కూర్చోబెట్టాలన్న సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్లాన్ విఫలమైనట్టేనా? ఈ ఉదయం ఎమ్మెల్యేలను అఖిలేష్ యాదవ్ సమావేశానికి ఆహ్వానించిన వేళ, అక్కడికి వచ్చి ఆయనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే అలానే అనిపిస్తోంది. 150 మందికి పైగా ఎమ్మెల్యేలు అఖిలేష్ వెంట నిలిచారు. ఈ పరిస్థితిలో ఆయన పదవికి వచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది. యూపీ అసెంబ్లీలో 404 స్థానాలుండగా, ప్రస్తుతం సమాజ్ వాదీ బలం 229.
ప్రభుత్వం నిలవాలంటే, 202 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక ఇప్పటికే 150 మందికి పైగా ఎమ్మెల్యేలు అఖిలేష్ వెంట, మరో 70 మంది వరకూ ములాయం వెంట ఉన్నట్టు తెలుస్తుండగా, అత్యవసర పరిస్థితి ఏర్పడితే, మరో పార్టీ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని కొనసాగించాలని అఖిలేష్ భావిస్తున్నట్టు సమాచారం. యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 28 మంది సభ్యుల బలం ఉండగా, బీజేపీకి 40, బీఎస్పీకి 80 మంది సభ్యుల బలముంది. ఆర్ఎల్డీకి 8 మంది సభ్యుల బలముంది. ఈ నేపథ్యంలో బల నిరూపణకు తాము సిద్ధమని అఖిలేష్ వర్గం సంకేతాలను పంపుతుండగా, మధ్యాహ్నం ములాయం ఇంట జరిగే సమావేశం కీలకంగా మారింది. అఖిలేష్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ములాయం వర్గంలోని ఎంతమంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉంటారన్న విషయంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడివున్నాయి.