: బ్యాంకుల్లోనే డబ్బులు ఇస్తున్న అధికారులు.. ఇంకా దిష్టిబొమ్మల్లానే ఏటీఎంలు
నోట్ల రద్దు ప్రకటించి 50 రోజులు గడిచిపోయినా దేశంలో మూడింట రెండొంతుల ఏటీఎంలు ఇంకా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకు బ్రాంచులకు అందుతున్న సొమ్మును సిబ్బంది ఏటీఎంలలో పెట్టకుండా నేరుగా బ్యాంకుల్లోనే పంపిణీ చేస్తుండడమే ఇందుకు కారణం. దేశంలో పనిచేస్తున్న ఏటీఎంల సంఖ్య 66 వేలు మాత్రమేనని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ(సీఏటీఎంఐ) అధ్యక్షుడు సంజీవ్ పటేల్ తెలిపారు. సీఏటీఎంఐ ప్రకారం దేశంలోని 2.2 లక్షల ఏటీఎంలలో కేవలం 20 శాతం ఏటీఎంలలోనే క్రమం తప్పకుండా నగదు నింపుతున్నారు.
నిజానికి ప్రతి ఏటీఎంలో రోజుకు రూ.7-8 లక్షలు నింపాల్సి ఉండగా రూ.2-3 లక్షలు మాత్రమే పెడుతున్నారు. దీనికి తోడు పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసేందుకు ఖాతాదారులు బ్యాంకులకు వెళ్తుండడంతో బ్యాంకు సిబ్బంది ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు ఆసక్తి చూపడం లేదని ఎన్సీఆర్ కార్పొరేషన్(ఇండియా అండ్ సౌత్ ఆసియా) ఎండీ నవ్‌రోజ్ దస్తుర్ తెలిపారు. బ్యాంకుల్లో ఒక్క వినియోగదారుడికి ఇచ్చే సొమ్మును ఏటీఎం ద్వారా పదిమందికి పంపిణీ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు తర్వాత ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మాత్రమే ఏటీఎంలలో క్రమం తప్పకుండా నగదు నింపుతోంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం తమ ఖాతాదారులకు బ్యాంకుల్లోనే నగదును పంపిణీ చేస్తున్నాయని దస్తుర్ వివరించారు.