: రాందేవ్ బాబా అంత తక్కువకు ఎందుకు కోట్ చేశారో? ఆ రహస్యాన్ని బయటపెట్టండి!: చంద్రబాబుపై భూమన ఫైర్
ఎర్రచందనం స్మగ్లర్లకు తెలుగుదేశం పార్టీ నేతలు బాసటగా నిలుస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. స్మగ్లర్లతో చేతులు కలిపిన నేతలు వారితో కలిసి వ్యాపారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రకృతి సంపద తరలిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే ఎర్రచందనం దొంగల పనిపడతానన్న చంద్రబాబు ఇప్పుడు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు.
కేంద్రంతో మాట్లాడి పోర్టుల నుంచి ఇతర దేశాలకు యథేచ్ఛగా ఎర్రచందనాన్ని తరలిస్తున్నారని పేర్కొన్నారు. రోజూ ఐదు వేలమందికిపైగా ఎర్రచందనం కూలీలు శేషాచలం అడవుల్లో పనిచేస్తున్నారని, వందల కోట్ల రూపాయల విలువైన సంపదను వారు కొల్లగొడుతున్నారని అన్నారు. సీ గ్రేడ్ రకం ఎర్రచందనం దుంగలను రాందేవ్ బాబా టన్ను రూ.28.40 లక్షలకు కొనుగోలు చేశారని.. అటువంటప్పుడు ఏ గ్రేడ్ రకానికి టన్నుకు రూ.92 వేలే కోట్ చేయడం వెనుక ఉన్న రహస్యమేంటో బయటపెట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.