: అనుయాయులతో తండ్రీ కొడుకుల విడివిడి మంతనాలు... యూపీలో శరవేగంగా మారుతున్న రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్టీలో చీలిక తప్పనిసరి అన్నట్టు పరిస్థితి కనిపిస్తుండగా, తమ వర్గం ఎమ్మెల్యేలతో నేడు అఖిలేష్, ములాయం విడివిడిగా సమావేశాలు జరపనున్నారు. ఉదయం 9:30 గంటలకు సమాజ్ వాదీ ఎమ్మెల్యేలతో అఖిలేష్ యాదవ్ భేటీ కానుండగా, ఆపై 11:30 గంటల సమయంలో తన వర్గం ఎమ్మెల్యేలతో ములాయం సింగ్ యాదవ్ సమావేశం కానున్నారు. బహిష్కృత అఖిలేష్ యాదవ్ తో కలవడం రాజ్యాంగ విరుద్ధమని ములాయం వ్యాఖ్యానించడం గమనార్హం.
"సమాజ్ వాదీ పార్టీని రక్షించేందుకు ఎలాంటి కఠిన చర్యలైనా తీసుకుంటాం. నాకు పదవి, గౌరవం ముఖ్యం కాదు. పార్టీని రక్షించడమే ముఖ్యం. పార్టీ కార్యకర్తలు అందరికీ నా విన్నపం ఒక్కటే. రాజ్యాంగ విరుద్ధమైన సమావేశాలకు హాజరు కాకండి. పార్టీని కాపాడండి. లేదంటే పార్టీ చీలిపోతుంది. నేను అలా జరగనివ్వను" అన్నారు ములాయం. కాగా, ములాయం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ పెను విభేదాలు చివరకు సమాజ్ వాదీ పార్టీలో చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.