: బెజవాడ వాసులకు తీపి కబురు..విజయవాడ నుంచి కాశీకి విమాన సర్వీసులు
త్వరలో విజయవాడ -పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ధర రూ.2500 ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెజవాడ నుంచి వారణాసి వెళ్లాలంటే తొలుత ఎయిరిండియా విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో కాశీకి వెళ్లాల్సి వస్తోంది. ఇక నుంచి ఈ బాధలు తీరనున్నాయి. 180 మంది ప్రయాణికులు పట్టే విమానాన్ని విజయవాడ నుంచి నేరుగా కాశీకి నడపాలని యోచిస్తున్నారు. ఈ విమానం అందుబాటులోకి వస్తే కేవలం మూడు నాలుగు గంటల్లోనే కాశీ చేరుకోవచ్చు. ఇక విజయవాడ నుంచి వారణాసికి రైలులో సెకెండ్ ఏసీలో వెళ్లాలంటే 30 గంటల సమయం పట్టడంతోపాటు రానుపోను చార్జీలు రూ.5140 వరకు అవుతున్నాయి. బస్సులో అయితే దీనికి రెట్టింపు చార్జీలు అవుతాయి. అదే విమానం కనుక అందుబాటులోకి వస్తే రైలు ప్రయాణానికి అయ్యే ఖర్చుతోనే ఎంచక్కా కాశీ వెళ్లి విశ్వనాథుడిని దర్శించుకుని వచ్చేయొచ్చు.