: తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు రూ. 630 కోట్లు జమ... కోటికి పైన డిపాజిట్ చేసిన వారు 115 మంది
రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఆఖరు తేదీ అయిన నిన్న (30) తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 630 కోట్ల మొత్తం జమ కాగా, ఒక్క హైదరాబాద్ లోనే రూ. 330 కోట్లు జమ అయినట్టు తెలుస్తోంది. చివరి రోజున లావాదేవీలపై ఐటీ అధికారులు నిశితంగా పరిశీలించారు. కాగా, 2 బ్యాంకుల్లోని 5 ఖాతాల్లో రూ. 67 కోట్లు జమ కాగా, తిరుపతిలోని పది ఖాతాల్లో సగటున రూ. 6 కోట్ల చొప్పున జమ అయ్యాయి.
ఇక ఆఖరి రోజున రూ. కోటి కన్నా అధికమొత్తాన్ని బ్యాంకుల్లో వేసుకున్న వారిలో 115 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు గరీబ్ కల్యాణ్ యోజన కింద పన్ను చెల్లించేందుకు అంగీకరించి లేఖలు ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గడచిన ఏడాది కాలంలో తన ఖాతాలో రూ. 11 వేలు మాత్రమే జమ చేసిన తిరుపతిలోని ఓ చిరు వ్యాపారి, నిన్న ఏకంగా రూ. 50 లక్షలను జమ చేసినట్టు అధికారులు గుర్తించారు. కాగా, నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకు శాఖల్లో రూ. 1.48 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు వెల్లడికానుంది.