: ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా? తమిళనాడులో జోరుగా వదంతులు!
తమిళనాడు రాజకీయాల్లో మరో ఉత్కంఠ మొదలైంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేయబోతున్నారంటూ శుక్రవారం జోరుగా వదంతులు వినిపించాయి. గురువారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం అనంతరం తిరిగి వెళ్లిపోతున్న పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన సందేశం కలకలం రేపింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలన్నదే దాని సారాంశం.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగిస్తూ తీర్మానం చేసిన సమయంలో కొందరు సభ్యులు మాట్లాడుతూ సీఎం పదవిని కూడా ఆమెకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ సందేశం అందుకే కాబోలు అని భావించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజనామా చేయబోతున్నారని, శశికళ సీఎం కానున్నారని అనుకుని శుక్రవారం మధ్యాహ్నం కల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు మళ్లీ పార్టీ కార్యాలయానికి రావడంతో పుకార్లు ఊపందుకున్నాయి. పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగబోతుందని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేలకు మరో వార్త అందింది. శనివారం పార్టీ పగ్గాలు అందుకోనున్న శశికళ.. జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు రానున్నారని, నేతలు సిద్దంగా ఉండాలని కబురు అందింది. దీంతో అప్పటి వరకు వ్యాపించినవన్నీ వదంతులేనని తేలింది.