: ఇదీ, ఒక కళాకారుడికి జరిగిన అవమానం!: హాస్యనటుడు పృథ్వీరాజ్ ఆవేదన
‘ఒక కళాకారుడికి జరిగిన అవమానం ఇదీ..’ అంటూ ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. పృథ్వీ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసిన పోస్ట్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘అనకాపల్లిలో షూటింగ్ కోసం నేను, తోటి కళాకారుడు కృష్ణ భగవాన్ వచ్చాం. ఇక్కడ ఒక హోటల్ లో దిగాం. మా బావగారు పిలవడంతో తనని కలవడానికి వెళ్లొచ్చేసరికి, నా లగేజ్ అంతా కింద పడేసి ఉంది. రూమ్ తాళం నాతోనే ఉంది. నా రూమ్ లోని వస్తువులు కింద పడేసి ఉండటం నా మనసుకు బాధ కలిగించింది. నలుగురికి ఆనందాన్ని పంచేవాడు కళాకారుడు. అలాంటి కళాకారుడి మనసు గాయపరచడం పద్ధతి కాదు. కళకు, కళాకారుడికి జరిగిన ఈ అవమానానికి చింతిస్తున్నాను. కళను, కళామతల్లిని గౌరవించడమే కళాకారుడికి మీరు ఇచ్చే గొప్ప సన్మానం’ అని ఆ పోస్ట్ లో పృథ్వీ బాధపడ్డాడు. కాగా, ఏ చిత్రం షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లారో ఆయన ప్రస్తావించలేదు.