: సీటొచ్చిన ఆనందంలో ప్రాణం పోయింది!
బాధ వచ్చినప్పుడే కాదు, పట్టరాని సంతోషంలో కూడా గుండె ఆగిపోతుందన్న విషయం మరోసారి ఉత్తరప్రదేశ్ రాజకీయనాయకుడి విషయంలో రుజువైంది. 2017 ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్ వాదీ పార్టీ జాబితాను ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఇందులో ఆగ్రా కంటోన్మెంట్ స్థానం ఆశిస్తున్న చంద్రసేన్ తప్లూ (45) కు సీటు కేటాయించారు.
అంతే.. ఆయన ఆనందం పట్టలేకపోయారు. తనకు సీటు కేటాయించిన ములాయంకు ధన్యవాదాలు చెప్పి, బంధుమిత్రులతో పార్టీ చేసుకున్నారు. అయితే ఈ ఆనందం పట్టలేకపోయిన ఆయనకు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు హార్ట్ అటాక్ వచ్చింది. గుండెనొప్పితో గిలగిల్లాడుతున్న అతనిని కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాధమిక చికిత్స చేసి, ఆయనను మేదాంత ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మధుర టోల్ ప్లాజా వద్ద ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంతోషంలో మునిగితేలిన ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.